Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పాకిస్థాన్‌లోని గురుద్వారాపై రాళ్ల దాడి.. తీవ్రంగా ఖండించిన భారత్

  • నాన్‌కానా గురుద్వారాపై దుండగుల రాళ్లదాడి
  • వణికిపోయిన సిక్కులు
  • తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్
పాకిస్థాన్‌లో సిక్కులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. ఆ దేశంలోని సిక్కుల భద్రత, సంక్షేమం కోసం వెంటనే చర్యలు చేపట్టాలని భారత విదేశాంగ శాఖ పాక్ ప్రభుత్వాన్ని కోరింది. గురునానక్ జన్మించిన పాకిస్థాన్‌లోని నాన్‌కానాలో ఉన్న నాన్‌కానా సాహిబ్ గురుద్వారాపై కొందరు దుండగులు నిన్న రాళ్లదాడికి పాల్పడ్డారు. దీంతో సిక్కులు భయంతో వణికిపోయారు. ప్రాణాలు అరచేత పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు.

ఈ ఘటనపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. దాడిని తీవ్రంగా ఖండించింది. సిక్కులను లక్ష్యంగా చేసుకుని పాక్‌లో దాడులు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోసారి ఇటువంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని కోరింది. మరోవైపు పంజాబ్ ముఖ్యమంత్రి కూడా ఈ ఘటనపై స్పందించారు. గురుద్వారాలో చిక్కుకున్న భక్తులను ఆందోళనకారుల రాళ్లదాడి నుంచి వెంటనే రక్షించాలని కోరారు.

గతేడాది ఆగస్టులో సిక్కు యువతి జగ్జీత్ కౌర్‌‌ను అపహరించిన దుండగులు మతమార్పిడి చేసి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత మళ్లీ ఇలా ఘటనలు జరగడం గర్హనీయమని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. నాన్‌కానా సాహిబ్ గురుద్వారా పవిత్రతను కాపాడతామంటూ గతంలో ఇచ్చిన హామీ ఏమైందని పాక్ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. రాళ్లదాడికి పాల్పడిన అల్లరి మూకలపై వెంటనే చర్యలు తీసుకోవాలని భారత్ కోరింది.
Pakistan
Gurdwara
Nankana Sahib
India

More Telugu News